శ్రీకాకుళం జిల్లాలో విషాదం నెలకొంది. వజ్రపుకొత్తూరు మండలం అనకాపల్లి గ్రామంలో ఎలుగుబంటి దాడిలో ఇద్దరు చనిపోయారు. అనకాపల్లి గ్రామ సమీపంలో ముగ్గురు వ్యక్తులపై ఎలుగుబంటి దాడి చేసింది.
ఈ ఘటనలో ఇద్దరు మరణించారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డ వ్యక్తిని సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం అతడి ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు డాక్టర్లు వెల్లడించారు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న అధికారులు హుటాహుటిన ఘటనా స్థలానికి వెళ్లి..పరిశీలించారు.
ఎలుగుబంటి దాడి గురించి సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. దానిని బంధించేందుకు అవసరమైన చర్యలు చేపట్టారు. ఈ ఘటనతో గ్రామంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. గ్రామం విడిచి బయటకు వచ్చేందుకు గ్రామస్తులు భయపడిపోతున్నారు. ఏ క్షణాన ఏం జరుగుతుందోనని ఆందోళన చెందుతున్నారు. రాత్రి వేళ ఎవరూ ఒంటరిగా బయటకు వెళ్లకూడదు.. గుంపు గుంపుగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. త్వరలోనే ఎలుగుబంటిని పట్టుకుంటామని చెప్పారు.