ధరణి పోర్టల్‌పై సీఎం రేవంత్‌ రెడ్డి కీలక ఆదేశాలు.. రద్దు చేయనున్నారా లేక?

భూ రికార్డులకు సంబంధించిన ధరణి పోర్టల్‌పై ముఖ్యమంత్రి సమీక్ష చేశారు. ఈ సందర్భంగా ధరణి పెండింగ్ దరఖాస్తులకు వెంటనే పరిష్కారం చూపాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మార్చి మొదటి వారంలోనే ఏర్పాట్లు చేయాలని, మెరుగైన రెవిన్యూ రికార్డుల నిర్వహణకు చట్ట సవరణ చేయాలని పేర్కొన్నారు. ధరణి పోర్టల్ ఏజెన్సీపై సమగ్ర విచారణకు ఆదేశించారు. అన్ని తహసీల్దార్ కార్యాలయాల్లో ధరణి సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టాలని రెవెన్యూ అధికారులకు చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న 2.45 లక్షల ధరణి కేసుల పరిష్కారానికి ఉన్న మార్గాలను సంబంధిత అధికారులతో చర్చించారు. రైతులను ఇబ్బంది పెట్టకుండా వెంటనే వీటికి చర్యలు తీసుకోవాలని సూచించారు.

 

హైదరాబాద్‌లోని డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ సచివాలయంలో ధరణిపై ముఖ్యమంత్రి, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి, ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, ధరణి కమిటీ సభ్యులు, రెవెన్యూ శాఖ అధికారులతో సమీక్ష చేశారు. 2020లో అమల్లోకి వచ్చిన ఆర్వోఆర్ చట్టంలో లోపాలున్నాయని ధరణి కమిటీ నివేదించింది. గత ప్రభుత్వం మూడు నెలల్లో హడావుడిగా చేపట్టిన రెవెన్యూ రికార్డుల నవీకరణతోనే కొత్త చిక్కులు వచ్చాయని తెలిపింది. వాటివలన లక్షలాది సమస్యలు ఉత్పన్నమయ్యాయని వివరించింది. ధరణి లోపాలను సవరణకు చట్ట సవరణ చేయడం లేదా కొత్త ఆర్‌ఓఆర్ చట్టం చేయడం మార్గాలు ఉన్నాయని ప్రభుత్వానికి నివేదించారు.

 

రైతుల భూముల రికార్డుల శాశ్వత పరిష్కారానికి చర్యలు చేపడదామని అధికారులకు సీఎం తెలిపారు. చట్ట సవరణ లేదా.. కొత్త చట్టం తీసుకువచ్చే అంశాలను పరిశీలిద్దామని చెప్పారు. ఎలాంటి భూ వివాదాలు, కొత్త చిక్కులు లేకుండా భూముల రికార్డులను పక్కాగా నిర్వహించాలని ఆదేశించారు. ఈ క్రమంలో ధరణి పోర్టల్ నిర్వహిస్తున్న ఏజెన్సీపై సమగ్ర విచారణ జరిపించాలని ఆదేశాలు జారీ చేశారు. సీసీఎల్ఏ అధ్వర్యంలో నిర్వహించాల్సిన పోర్టల్‌ను ప్రైవేటు ఏజెన్సీలకు ఎందుకు అప్పగించారని ప్రశ్నించారు. లక్షలాది మంది రైతుల భూముల రికార్డులు విదేశీ కంపెనీల చేతుల్లో ఉన్నాయని తెలిపారు. భూముల రికార్డుల డేటాకు భద్రత ఉందా అని ఆరా తీశారు. ఏజెన్సీపై సమావేశంలో సుదీర్ఘంగా చర్చ జరగ్గా.. అనంతరం ఏజెన్సీప్‌ విచారణకు ఆదేశించారు.

Loading

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు